-కమిషనర్‌కు అభ్యంతర పత్రం అందజేసిన బీజేపీ కౌన్సిలర్లు
(నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్ జూలై 22:
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 49 వార్డుల్లో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ బీజేపీ మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్‌కు అధికారికంగా అభ్యంతర పత్రం (డిసెంట్ నోట్) సమర్పించారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్‌ను కలిసి వార్డుల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలు, పారిశుద్ధ్య లోపాలు, తాగునీటి ఇబ్బందులు, రోడ్ల దుస్థితి తదితర అంశాలను ప్రస్తావిస్తూ వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, గురువారం జరగనున్న మున్సిపల్ సర్వసభ్య సమావేశ ఎజెండాలో పొందుపరిచిన పలు అంశాలపై తమకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. ప్రజల అవసరాలు, వార్డుల అభివృద్ధి అంశాలను పక్కనపెట్టి, కొన్ని ప్రతిపాదనలు ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు చేసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. ప్రజల పన్నుల రూపంలో వచ్చిన నిధులను అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని పేర్కొన్నారు.
పట్టణంలోని అనేక వార్డుల్లో మౌలిక వసతుల సమస్యలు పేరుకుపోయినా వాటి పరిష్కారంపై సరైన దృష్టి సారించడం లేదని వారు విమర్శించారు. ముందుగా వార్డుల సమస్యలను పరిష్కరించి, ప్రజలకు అవసరమైన సేవలు అందించిన తరువాతే ఇతర ప్రతిపాదనలపై నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే కార్యక్రమాలకే నిధులు కేటాయించాలని, ప్రజాధన దుర్వినియోగానికి అవకాశం కల్పించే ప్రతిపాదనలను వెంటనే ఉపసంహరించుకోవాలని బీజేపీ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. మున్సిపల్ పాలకవర్గం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి కేంద్రీకరించి, అన్ని వార్డులకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

