(నమస్తే ఇందూర్): కామారెడ్డి ప్రతినిధి ఆగస్టు 03:
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 1వ వార్డు పరిధిలోని వడ్లూరు శివారులోని తన వ్యవసాయ క్షేత్రంలో కౌన్సిలర్ మాట్లాడుతూ. బీఆర్ఎస్ 17వ వార్డు కౌన్సిలర్ లోలం శ్రీనివాస్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు భరోసా, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలయ్యాయని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా ప్రజలను నిరాశపరిచిందని ఆరోపించారు. రైతులకు సకాలంలో రైతు భరోసా అందడం లేదని, రైతు బీమా ప్రయోజనాలు కూడా సక్రమంగా అందక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు, వ్యవసాయ కూలీల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హయాంలో అమలైన రైతు సంక్షేమ పథకాలను రైతులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని, ఆ పాలనను మరువలేదని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో యూరియా కొరత ఉండేది కాదని, ప్రస్తుతం యూరియా కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసి బుకింగ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది రైతులు సాధారణ మొబైల్ ఫోన్లనే ఉపయోగిస్తున్నారని, అలాంటి రైతులు ఆన్‌లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలని ప్రశ్నించారు. రైతులకు ఇబ్బందులు కలిగించే విధానాలను ప్రభుత్వం వెంటనే పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు.ఇటీవల పొలాల్లో నాట్లు వేస్తున్న రైతులు, వ్యవసాయ కూలీలు “మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలి” అంటూ పాటలు పాడుతూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం ప్రజల్లో బీఆర్ఎస్‌పై ఉన్న ఆదరణకు నిదర్శనమని లోలం శ్రీనివాస్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని, ప్రస్తుతం వర్షాభావం, పంటల నష్టం, ఉపాధి కొరత కారణంగా రైతులు, వ్యవసాయ కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో రాజశేఖర్, తిరుపతి, నరసింహులు, పెంటా గౌడ్, శ్రీధర్‌తో పాటు మహిళలు, రైతులు, వ్యవసాయ కూలీలు తదితరులు పాల్గొన్నారు.


