-భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఆదేశం
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, ఆగస్టు 05:
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ బుధవారం కామారెడ్డి పట్టణంలోని పెద్ద చెరువును సందర్శించి, చెరువులోకి వస్తున్న వరద నీటి ప్రవాహం, పొంగిపొర్లుతున్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా చెరువు పరిసర ప్రాంతాల్లో ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. ప్రమాదకర ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించడంతో పాటు, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. చెరువు వద్ద ప్రజలు, ముఖ్యంగా యువకులు, పిల్లలు చేరకుండా హెచ్చరిక బోర్డులు, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి భద్రతా చర్యలను కట్టుదిట్టం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, వరద నీటి ప్రవాహాలు, చెరువులు, వాగులు, కాలువల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ సూచించారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు అన్ని చర్యలు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు.ఈ పరిశీలనలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, కామారెడ్డి టౌన్ ఎస్హెచ్వో శ్రీహరి, కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీధర్, దేవునిపల్లి ఎస్ఐ రంజిత్, పోలీసు సిబ్బంది మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


