-రవీంద్ర భారతిలో నియామక పత్రం అందజేత
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
బిక్కనూర్, అక్టోబర్ 10:
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బిక్కనూర్‌కు చెందిన భూర్ల రేణు కుమార్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో నిర్వహించిన సమాచార హక్కు వారోత్సవాల కార్యక్రమంలో ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. కమిటీ వ్యవస్థాపకులు, జాతీయ చైర్‌పర్సన్ చంటి ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి చేతుల మీదుగా రేణు కుమార్ నియామక పత్రాన్ని స్వీకరించారు.
సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించడం, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకతను ప్రోత్సహించడం, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన సమాచారాన్ని చట్టపరంగా పొందే విధానాలపై అవగాహన పెంపొందించడం వంటి అంశాల్లో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్న భూర్ల రేణు కుమార్ కమిటీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, సమాచార హక్కు చట్టం ప్రాధాన్యతను విస్తృతంగా ప్రచారం చేయడానికి కృషి చేయనున్నారు.ప్రజలకు ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగకరమని, ఈ చట్టంపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన భూర్ల రేణు కుమార్‌కు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.


