-బంగారం, వెండి, నగదు అపహరణ
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూలై 21:
బాన్సువాడ పట్టణంలోని బీడీ వర్కర్స్ కాలనీలో మంగళవారం దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించిన గుర్తుతెలియని దుండగులు ఓ ఇంటిని లక్ష్యంగా చేసుకుని చోరీకి పాల్పడ్డారు.కాలనీకి చెందిన ఆర్టీసీ కండక్టర్ మోత్కూరి విమల ఇంటికి తాళాలు వేసి బయటకు వెళ్లగా, అదే అవకాశంగా భావించిన దొంగలు ఇంటి ప్రధాన తాళాలను పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం బీరువాను తెరిచి అందులో భద్రపరిచిన ఒక తులం బంగారం, 12 తులాల వెండి ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించి పరారయ్యారు.
సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన విమల ఇంటి తాళాలు పగిలి ఉండటంతో పాటు బీరువాలోని వస్తువులు చిందరవందరగా కనిపించడంతో చోరీ జరిగిన విషయం గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించి, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దుండగులను గుర్తించేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘటనతో బీడీ వర్కర్స్ కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. రాత్రి వేళల్లో పోలీసు గస్తీని మరింత పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

