వానదేవుడా కరుణించవా..!
చినుకమ్మా ఒక్కసారి వచ్చిపోవమ్మా..!
రైతన్నల ఆర్తనాదం
-రైతన్న గోడులపై నమస్తే ఇందూర్ కథనం
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 16:
“వానదేవుడా కరుణించవా.. చినుకమ్మా ఒక్కసారి వచ్చిపోవమ్మా..” అంటూ రైతన్నలు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లా లోని పరిస్థితులు నెలకొన్న వైనం మండలాల్లోని పలు గ్రామాల్లోని వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తొలకరి వానలను నమ్ముకొని అప్పులు తెచ్చి విత్తనాలు కొనుగోలు చేసి పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు వరుణుడి కరుణ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.ఈ వానాకాలం ప్రారంభమై రెండు నెలలు దాటినా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న పంటలు ఎండుముఖం పడుతున్నాయి. దుక్కులు దున్ని, విత్తనాలు నాటి ఎంతో ఆశతో సాగు ప్రారంభించిన రైతులకు వర్షాలు లేకపోవడం పెద్ద దెబ్బగా మారింది. మొలకెత్తిన పంటలు తగిన తేమ లేక వాడిపోతుండగా, కొన్ని చోట్ల విత్తనాలు నేలలోనే బూడిద అయిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రతి గ్రామానికి చెందిన రైతులు మాట్లాడుతూ, గోడు విన్న వించుకుంటున్నారు మండలాలు, గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ పనులు లేకపోవడంతో కొందరు సమీప పట్టణాలకు, మరికొందరు ఇతర రాష్ట్రాలు, గల్ఫ్ దేశాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. వర్షాలు లేకపోవడం వల్ల రైతులతో పాటు వ్యవసాయ కూలీల జీవనోపాధి కూడా సంక్షోభంలో పడింది.ఇలాగే వరుణుడు కరుణించకపోతే గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆకాశం వైపు ఆశగా ఎదురుచూస్తూ వర్షాల కోసం ప్రార్థిస్తున్నారు. ఇప్పటికైనా వానదేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపిస్తే జిల్లాలోని పొలాలు పచ్చని పంటలతో కళకళలాడుతాయని, రైతన్నలతో పాటు వ్యవసాయ కూలీల జీవితాల్లోనూ ఆనందం నిండుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.”అప్పులు చేసి పంటలు వేశాం. వర్షం పడకపోవడంతో పెట్టుబడులు కూడా తిరిగి వస్తాయో లేదో తెలియడం లేదు. పంటలు ఎండిపోతుండటంతో ఏం చేయాలో అర్థం కావడం లేదు” అని వేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సరిపడా వర్షాలు లేకపోవడంతో ఈపాటికే సాగు పనులతో కళకళలాడాల్సిన పొలాలు వెలవెలబోతున్నాయి. ఎండ తీవ్రత పెరగడంతో మొక్కజొన్న, వరి నారుమళ్లు, పత్తి మొక్కలు ఎండిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మళ్లీ విత్తనాలు వేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని రైతులు భయాందోళన చెందుతున్నారు.వర్షాలు కురవాలని కోరుతూ పలు గ్రామాల్లో గ్రామదేవతలకు జలాభిషేకాలు, ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు కుల దేవతలకు బోనాలు సమర్పిస్తున్నారు. రైతులు కుటుంబ సమేతంగా దేవాలయాలకు వెళ్లి వర్షాల కోసం ప్రార్థనలు చేస్తున్నారు. “వానమ్మా వానమ్మా ఒక్కసారి రావమ్మా” అంటూ పాటల రూపంలో వరుణుడిని వేడుకుంటున్నారు.వ్యవసాయం పూర్తిగా వర్షాలపై ఆధారపడి ఉండటంతో రైతన్నల చూపులన్నీ ఇప్పుడు ఆకాశం వైపే నిలిచిపోయాయి. ఎండిపోతున్న పంటలకు ప్రాణం పోసే వాన చినుకుల కోసం అన్నదాతలు ఆర్థిగా ఎదురుచూస్తున్నారు. వరుణుడు కరుణించి వర్షాలు కురిపించాలని రైతుల మొర వినిపిస్తోంది.

