(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 04:
రక్తదానం అత్యున్నత మానవతా సేవ అని, ఒక వ్యక్తి ఇచ్చే రక్తం మరొకరికి ప్రాణదానంగా మారుతుందని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామంలో సౌత్ క్యాంపస్, బిక్కనూర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎన్‌ఎస్‌ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా శనివారం ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ థలసేమియా బాధితులు, ప్రమాదాల్లో గాయపడిన వారు, అత్యవసర చికిత్స పొందుతున్న రోగులు తరచుగా రక్తంపై ఆధారపడాల్సి వస్తుందని తెలిపారు. అలాంటి వారికి ప్రతి యూనిట్ రక్తం అమూల్యమైందని, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేసి సమాజానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు.శిబిరంలో 60 మంది స్వచ్ఛంద రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని పేర్కొన్న ఎస్పీ, యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజానికి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
యువత గంజాయి, డ్రగ్స్, మద్యం, పొగాకు వంటి చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, విద్య, క్రీడలు, సేవా కార్యక్రమాలపై దృష్టి సారించాలని కోరారు. సరదాగా ప్రారంభమయ్యే వ్యసనాలు భవిష్యత్తును నాశనం చేసే స్థాయికి తీసుకెళ్తాయని హెచ్చరించారు.విద్యార్థులు తమ జీవిత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదవాలని, చిన్న చిన్న సమస్యలు, ఒత్తిళ్లు లేదా అపజయాలకు ఆత్మహత్య వంటి తీవ్రమైన నిర్ణయాలు ఎప్పటికీ పరిష్కారం కాదని స్పష్టం చేశారు. ఎలాంటి సమస్య ఎదురైనా తల్లిదండ్రులు, అధ్యాపకులు లేదా పోలీసులను సంప్రదించి సరైన మార్గదర్శకత్వం పొందాలని సూచించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న ఎస్పీ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. సమాజంలో గంజాయి లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి, బిక్కనూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ నరేష్, బిక్కనూర్ ఎస్‌ఐ ఆంజనేయులు, కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, వైద్య సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

