-తాడ్వాయి మండలం చిట్యాలలో హృదయ విదారక ఘటన
(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా
తాడ్వాయి జులై 16:
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో తల్లి మరణాన్ని తట్టుకోలేక కూతురు గుండెపోటుతో మృతి చెందిన హృదయ విదారక ఘటన తాడ్వాయి మండలం చిట్యాల గ్రామంలో చోటుచేసుకుంది. ఒకే రోజు, కొన్ని నిమిషాల వ్యవధిలో తల్లి, కూతురు ఇద్దరూ కన్నుమూయడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన మంగలి నర్సవ్వ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంచానికే పరిమితమైంది. తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలుసుకున్న ఆమె కుమార్తె, ధర్మారావుపేట గ్రామం నుంచి పుట్టింటికి వచ్చి తల్లిని పరామర్శించింది.ఈ క్రమంలో నర్సవ్వ ఆరోగ్యం మరింత క్షీణించడంతో కుమార్తె స్వయంగా తల్లి నోట్లో పాలు పోసింది. అనంతరం కొద్దిసేపటికే నర్సవ్వ తుదిశ్వాస విడిచింది. తాను ఎంతో ప్రేమించిన తల్లి ఇక లేరనే వార్తను జీర్ణించుకోలేక కుమార్తె తీవ్ర మనోవేదనకు గురైంది. షాక్‌తో ఒక్కసారిగా కుప్పకూలిన ఆమెకు గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఒకే కుటుంబంలో తల్లి, కూతురు ఇద్దరూ ఒకే రోజు మృతి చెందడంతో బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు. ఒకేసారి ఇద్దరి అంత్యక్రియలు నిర్వహించాల్సి రావడం కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటన చిట్యాల గ్రామంలో ప్రతి ఒక్కరినీ కలచివేసింది.

