(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద, జూలై 18:
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో జరిగిన షాప్ చోరీ కేసును పోలీసులు వేగంగా ఛేదించి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి బాధితుడికి చెందిన మొబైల్ ఫోన్‌తో పాటు మరో మూడు స్మార్ట్‌ఫోన్లు, దొంగతనాలకు ఉపయోగించిన మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం, బిచ్కుంద గ్రామానికి చెందిన వ్యాపారి షేక్ షాదుల్ తన రాయల్ వెల్డింగ్ షాపుకు తాళం వేసి వెళ్లగా, జూలై 15 రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాపు షట్టర్ తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. అనంతరం షాపులో ఉన్న సుమారు రూ.10 వేల విలువైన వివో
(Vivo E-30) మొబైల్ ఫోన్‌ను అపహరించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా బిచ్కుంద ఎస్‌ఐ జి. రాజు ఆధ్వర్యంలో పోలీసులు అయ్యప్ప టెంపుల్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక మోటార్‌సైకిల్‌పై అనుమానాస్పదంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను ఆపి విచారించగా, వారు పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నారు.అరెస్టు చేసిన నిందితుల్లో కుంచెపు గౌరి అలియాస్ రవి (32), మియాపూర్, హైదరాబాద్ నివాసి కాగా, స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా. ఇతనిపై గతంలో షాబాద్, చౌదరిగూడెం పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాల కేసులు నమోదయ్యాయి. మరో నిందితుడు మురళి ప్రధాన్ (32), ఒడిశా రాష్ట్రంలోని జాజ్‌పూర్ జిల్లా నివాసి. ఇతనిపై మేదక్ జిల్లా చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో నేర చరిత్ర ఉన్నట్లు పోలీసులు తెలిపారు.నిందితుల వద్ద నుంచి బాధితుడికి చెందిన ఒక వివో మొబైల్ ఫోన్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో చోరీ చేసిన ఒక వన్‌ప్లస్, ఒక రియల్‌మీ, ఒక శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు, అలాగే దొంగతనాలకు ఉపయోగించిన హోండా షైన్ మోటార్‌సైకిల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా బిచ్కుంద పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. గ్రామాలు, కాలనీల్లో కొత్త వ్యక్తులు లేదా అనుమానాస్పదంగా సంచరించే వారిని గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. రాత్రి సమయంలో ఇళ్లు, దుకాణాలకు బలమైన తాళాలు వేసుకోవడంతో పాటు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏదైనా అనుమానాస్పద పరిస్థితి కనిపించినా లేదా అత్యవసర సహాయం అవసరమైనా వెంటనే డయల్-100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

