(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూలై 04 :
బాన్సువాడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రి ఆవరణలో వర్షపు నీరు నిల్వ ఉండడంతో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన స్వల్ప వర్షానికే ఆసుపత్రి ప్రాంగణంలోని పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు బురదమయంగా మారింది. దీంతో ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చే ప్రజలు, వృద్ధులు, గర్భిణీలు, చిన్నారులు రాకపోకలు సాగించడంలో ఇబ్బందులు పడుతున్నారు.ఆసుపత్రి ప్రధాన మార్గాలు, వార్డుల పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో రోగులు జారిపడే ప్రమాదం కూడా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి ఆవరణలోనే ఇలాంటి పరిస్థితులు నెలకొనడం పట్ల పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఆసుపత్రి పరిసరాల్లో డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు నీరు నిల్వ కాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రోగులు, వారి బంధువులు కోరుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి సమస్యను పరిశీలించి శాశ్వత పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

