(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా, పిట్లం, జూలై 10:
కామారెడ్డి జిల్లాలో అక్రమ మద్యం విక్రయాలు, దాబాల్లో సిట్టింగుల నిర్వహణపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ నేపథ్యంలో పిట్లం మండలంలోని దుర్గ భవాని (సంతు) దాబాలో బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించిన యజమానిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు.పిట్లం గ్రామ శివారులో ఉన్న దుర్గ భవాని (సంతు) దాబా యజమాని రాథోడ్ సంతోష్ (తండ్రి నాగ్‌నాథ్) గతంలో అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, సిట్టింగులు నిర్వహించరాదని హెచ్చరిస్తూ 2025 ఆగస్టు 30న పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎమ్మార్వో సమక్షంలో రూ.50 వేల బైండోవర్ చేశారు. ఒక సంవత్సరం పాటు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు.అయితే 2026 మే 17న అదే దాబాలో మళ్లీ అక్రమంగా మద్యం సిట్టింగులు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో అక్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు గుర్తించిన అధికారులు, గతంలో విధించిన బైండోవర్ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధారించారు.దీంతో శుక్రవారం పిట్లం ఎస్‌ఐ ఆంజనేయులు ఎమ్మార్వో సమక్షంలో రాథోడ్ సంతోష్‌కు రూ.15 వేల జరిమానా విధించారు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి ఉల్లంఘనలు పునరావృతం కాకుండా ఉండేందుకు రూ.1 లక్ష మొత్తానికి మళ్లీ బైండోవర్ చేశారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర మాట్లాడుతూ జిల్లాలోని దాబా యజమానులు తమ వ్యాపార ప్రాంగణాల్లో అక్రమ మద్యం విక్రయాలు, సిట్టింగులు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అవకాశం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకసారి బైండోవర్ చేసిన తరువాత కూడా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు భారీ మొత్తాలకు బైండోవర్ చేయడం, అవసరమైతే చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లావ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

