-చెక్‌పోస్టులను బేఖాతర్ చేస్తున్న అక్రమ రవాణాదారులు
-ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల నుంచి వేల రూపాయల వసూళ్లు
(నమస్తే ఇందూర్) జుక్కల్ ఆర్సీ
జూలై 10:
ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, సిర్పూర్ మంజీర పరివాహక ప్రాంతంలోని డోంగ్లి మండలంలో అక్రమ ఇసుక రవాణా యథేచ్ఛగా కొనసాగుతోంది. మంజీరా నది పరివాహక ప్రాంతం నుంచి ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల వరకు భారీ ఎత్తున ఇసుక తరలింపు జరుగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.అక్రమ రవాణాను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన చెక్‌పోస్టులు నామమాత్రంగా మారాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెక్‌పోస్టుల ముందుగానే బొలెరోలు, ట్రాక్టర్ల ద్వారా ఇసుక రవాణా నిరాటంకంగా సాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇసుక మాఫియా మరింత రెచ్చిపోతున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.పేదలపై ఇసుక భారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపడుతున్న పేద లబ్ధిదారులే ఈ అక్రమ దందాకు ప్రధాన బలవుతున్నారని స్థానికులు చెబుతున్నారు. డోంగ్లి మండలంలోని పలు గ్రామాల్లో ఒక బొలెరో ఇసుకకు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు, ఒక ట్రాక్టర్ ఇసుకకు రూ.6 వేల నుంచి రూ.7 వేల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వం ఉచితంగా అందించాల్సిన ఇసుక కోసం పేదలు వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.సమీప మద్నూర్ మండలంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని చెబుతున్నారు. అక్కడ ఒక బొలెరో ఇసుక ధర రూ.6 వేల నుంచి రూ.8 వేల వరకు, ఒక ట్రాక్టర్ ఇసుక ధర రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
రాత్రివేళల్లో ఇసుక మాఫియా హవా
రాత్రి సమయంలో భారీ సంఖ్యలో ఇసుక వాహనాలు సంచరించడంతో గ్రామీణ రహదారులు దెబ్బతింటున్నాయి. వేగంగా వెళ్లే వాహనాల వల్ల శబ్ద కాలుష్యం పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నది ఒడ్డున జరుగుతున్న అక్రమ తవ్వకాల కారణంగా పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.చర్యలు తీసుకోవాలని డిమాండ్
సిర్పూర్ మంజీర పరివాహక ప్రాంతంలో కొనసాగుతున్న అక్రమ ఇసుక రవాణాను వెంటనే అరికట్టి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చెక్‌పోస్టుల్లో సిబ్బందిని పెంచడంతో పాటు రాత్రివేళల్లో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహించాలని కోరుతున్నారు. ఉచిత ఇసుక విధానం నిజంగా పేదలకు చేరేలా ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

