-ప్రజల భాగస్వామ్యంతోనే మున్సిపాలిటీకి మంచి పేరు వస్తుంది మున్సిపల్ కమిషనర్ రమేష్
-ఇంటి పరిశుభ్రతే ఆరోగ్య భద్రత 4వ వార్డు కౌన్సిలర్ జైపాల్ నాయక్
(నమస్తే ఇందూర్) మెదక్ జిల్లా తూప్రాన్ ప్రతినిధి జూలై 21:
మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో మంగళవారం ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, 4వ వార్డు కౌన్సిలర్ జైపాల్ నాయక్ పాల్గొని కాలనీలో పరిశుభ్రత చర్యలను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలనీలో శుభ్రత పనులు చేపట్టడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరంపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కౌన్సిలర్ జైపాల్ నాయక్ మాట్లాడుతూ, ఇంటి పరిశుభ్రతే ఆరోగ్య భద్రతకు మూలమని అన్నారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా మున్సిపల్ సిబ్బందికి సహకరించాలని సూచించారు. అలాగే ఇళ్ల చుట్టూ పిచ్చి మొక్కలు, గడ్డి పెరగకుండా శుభ్రపరచుకోవడం ద్వారా దోమలు, వ్యాధులు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చని తెలిపారు.
మున్సిపల్ కమిషనర్ రమేష్ మాట్లాడుతూ, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. మున్సిపాలిటీ ఒక్కటే పరిశుభ్రతను కాపాడలేదని, ప్రజల సహకారం కూడా అవసరమని అన్నారు. ప్రజల భాగస్వామ్యంతో తూప్రాన్ మున్సిపాలిటీని పరిశుభ్రతలో అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కొక్కొండ కాశిరెడ్డి, మున్సిపల్ మేనేజర్ శ్రీకాంత్, శానిటేషన్ అధికారి మధు విష్ణువర్ధన్, మున్సిపల్ సిబ్బంది, అధికారులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


