Monday, July 20, 2026
Homeతెలంగాణపీఎం విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలి..

పీఎం విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలి..

📰 Generate e-Paper Clip

  1. (-పీఎం విశ్వకర్మ కౌశల్ యోజన జిల్లా కన్వీనర్ సతీష్ విశ్వకర్మ)

(నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద, జూలై 09:

సాంప్రదాయ చేతివృత్తుల వారికి ఆర్థికంగా మరింత బలం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని పీఎం విశ్వకర్మ కౌశల్ యోజన జిల్లా కన్వీనర్ సతీష్ విశ్వకర్మ పిలుపునిచ్చారు. గురువారం బిచ్కుందలో పీఎం విశ్వకర్మ పథకంపై నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతరించిపోతున్న సాంప్రదాయ చేతివృత్తులు, కులవృత్తులపై ఆధారపడి జీవించే కుటుంబాలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. చేతివృత్తుల వారిలో నైపుణ్యాలను పెంపొందించి, ఉత్పాదకత, నాణ్యతను మెరుగుపరచడం ద్వారా వారి జీవనోపాధిని అభివృద్ధి చేయడమే పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, కంసాలి, చాకలి, మంగలి, ఉప్పరి, ఎరుకల, దర్జీ తదితర 18 సంప్రదాయ వృత్తులకు చెందిన వారికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా వ్యాపారాల ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు శిక్షణతో పాటు రుణ సదుపాయాలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు.18 సంవత్సరాలు నిండిన కుటుంబ సభ్యుల్లో ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులని, ఎలాంటి విద్యార్హత అవసరం లేదని పేర్కొన్నారు. అయితే కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదని స్పష్టం చేశారు. అర్హులైన వారు రేషన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్, మొబైల్ నంబర్‌తో సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (సి.ఎస్.సి.) ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చన్నారు.దరఖాస్తులను గ్రామ పంచాయతీ స్థాయిలో పరిశీలించి జిల్లా అమలు కమిటీకి పంపిస్తారని తెలిపారు. ఎంపికైన వారికి రెండు దశల్లో శిక్షణ అందజేస్తారని, ప్రాథమిక నైపుణ్య శిక్షణ 5 నుంచి 7 రోజులు, అధునాతన నైపుణ్య శిక్షణ 15 రోజుల పాటు ఉంటుందని చెప్పారు. శిక్షణ కాలంలో ప్రతిరోజూ రూ.500 భృతి చెల్లించడంతో పాటు శిక్షణ పూర్తయిన అనంతరం రూ.15 వేల విలువైన టూల్ కిట్, ధ్రువీకరణ పత్రం అందజేస్తారని వెల్లడించారు.అలాగే రెండు విడతలుగా మొత్తం రూ.3 లక్షల వరకు బ్యాంకు రుణ సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. రుణాల మంజూరు లేదా ఇతర అంశాలకు సంబంధించి ఏవైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో పీఎం విశ్వకర్మ జిల్లా సభ్యులు గోపాల్ చారి, అశోక్, సంబంధిత శాఖల అధికారులు, చేతివృత్తుల ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

App Icon

Install NI News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!